About Us

సంచార ముస్లింలు ఎవరు?

ఆర్ధికంగా సామాజికంగా అత్యంత వెనుకపడిన సామాజికవర్గాలలో ముస్లింలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని సచార్ కమిటీ నివేదిక నుండి నేటి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సమగ్ర సర్వేలో కూడా తేటతెల్లమైంది. అందులోనూ బీసీ ఈ కేటగిరిలో ఉన్న 14 సంచార జాతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పధకాలు అందక బతుకు భారమై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ముస్లింలలో దాదాపు 80% మంది బీసీ ఈ కేటగిరిలో ఉన్న 14 సంచార జాతులవారే. 75 సంవత్సరాల నుండి ఎవరొ వస్తారు ఎదో చేస్తారని వేచి చూసి విసిగి వేసారిన అనంతరం ఈ 14 సంచార జాతుల ముస్లింలు ఇప్పుడు తమకు న్యాయంగా రావలసిన హక్కులు అవసరాల కోసం పోరాట బాట పట్టారు. స్వంత సమాజంలోని రాజకీయ నాయకులు తమ పరపతికోసం ఎదుగుదలకు ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు జాతిని తాకట్టు పెట్టి తమ పబ్బం గడుపుకొని అనంతరం జాతిని జనాన్ని పట్టించుకోవడం మానెయ్యడం సర్వసాధారణం అయిపొయింది. అందుకే ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురుచూడకుండా జాతి నుండి జాతికోసం పనిచేయడానికి సిద్ధమై కనీసం రేపటితరానికైనా ఉజ్వల భవిష్యత్తు అందించడానికి వ్యయ ప్రయాసలకు వెరవక నేటితరం యువత చేపట్టింది ఈ న్యాయ పోరాటం
నా పేరు యూసుఫ్ అని కాకుండా ప్రణయ్ అని చెప్పినా మధుకర్ అని చెప్పినా, రోహిత్ అని చెప్పినా ఎవరైనా నమ్ముతారు. ఈ దేశంలో ఉన్న 90 శాతం పైగా ముస్లింల పేర్లు ఇలా మార్చి చెప్పినా నమ్ముతాం. అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ ల పేర్లు ముస్లిం పేర్లు చెప్పినా నమ్ముతాం. ఎందుకు?

బయటి దేశస్తులు మమ్మల్ని చూసినప్పుడు ముందు ఇండియన్స్ అని గుర్తు పడతారు. తరువాత మా పేర్లు చెబితే ఓహో వీళ్ళు ఇండియన్ ముస్లింలు అని గుర్తు పడతారు. ఎందుకు?
మన దేశంలో 20 కోట్లమందికి పైగా ముస్లింలున్నారు. తెలంగాణ లో 60 లక్షల దాకా ఆంధ్రప్రదేశ్లో 40 లక్షలదాకా ఉన్నారు. ఇంత పెద్ద సమూహం ఇవాళ భయంకరమైన సాంఘిక వివక్షకు, దుర్భర దారిద్ర్యానికి, అత్యంత నిరాదరణకూ, నిరక్ష్యరాస్యతకూ గురవుతూ వస్తున్నది. అన్నిరంగాల్లో అట్టడుగునపడి కొట్టుమిట్టాడుతున్నది. ఇవాళ 70 శాతం ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, వీళ్లలో 18 శాతంమంది మాత్రమే ‘అక్షరాస్యుల’నీ, ఆడవాళ్లు మరీ 4 శాతమేననీ, అన్నిరంగాల్లో రెండు, మూడు శాతమో, అంతకన్నా తక్కువో ఉన్నారనీ, ఎస్సీ, ఎస్టీల కన్నా, ఇతర మైనారిటీలకన్నా వెనకబడి ఉన్నారనీ ఎన్నో నివేదికలు చెబుతున్నాయి.

ముస్లింలకు చదువుల్లేవు.. ఉద్యోగాల్లేవు.. పదవుల్లేవు.. పరిశ్రమల్లేవు. భూముల్లేవు. ముఖ్యంగా 90 శాతం మందికి ఏ వృత్తులూ లేవు. ఇన్నాళ్లు బిజెపి, ఆరెస్సెస్ వాళ్లు ముస్లింలను భారతీయులు కాదంటూ ప్రచారం చేశారు, బీసీ ‘ఇ’ రిజర్వేషన్ కల్పించినప్పుడు కొంతమంది బిసీలు ముస్లింలు బీసీలు ఎట్లవుతారన్నారు. మరి ముస్లింలు ఎవరు?
ముస్లింలు ఈ దేశ మూలవాసులు! ద్రావిడులు!

శతాబ్దాల నాడు ఈ దేశంలోని మూలవాసులైన ద్రావిడులమీద ఆధిపత్యం సంపాదించిన ఆర్యులు (బ్రాహ్మణులు, కొన్ని అగ్రకులాలవాళ్లు) ద్రావిడుల్నంతా అంటరానివాళ్లని చేసి పారేశారు. ముడ్డికి తాటాకు కట్టి మీ అడుగుల గుర్తులు కూడా కనబడొద్దన్నారు. మూతికి ముంత కట్టి మీ ఉమ్మి కూడా నేలమీద పడొద్దన్నారు. ఊరికీ, కాటికీ, ఆఖరికి మంచి నీళ్లకూ దూరం చేశారు. వాళ్లొస్తుంటే చెప్పులు విడిచి చేత పట్టుకొని పక్కకు నిలబడాలి. తలకు రుమాల ఉంటే తీసిపట్టుకోవాలి. బడికీ, గుడికి కూడా అంటరానివాళ్లను చేశారు. అలాంటి ఎన్నో అవమానాలు, హింస అనుభవిస్తూ వచ్చిన ఎంతో కాలానికి సూఫీ ప్రవక్తలు వచ్చి వీరిని అక్కున చేర్చుకున్నారు. వాడు అసుంట అసుంట అంటే సూఫీలు వీరికి అలాయిబలాయి ఇచ్చారు. గుండెకు గుండెను కలిపారు. వీరు తాగిన గిలాసుల్లో వాళ్లు నీళ్లు తాగారు. వీరితోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి వీరి శవాల్ని కూడా తీసుకెళ్లనివ్వని దుష్ట సంస్కృతిని బద్దలు చేస్తూ వీళ్ళ శవానికి వాళ్లు భుజం పట్టారు. వీరు మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించారు. వీరి గుండెలు చెరువులయ్యాయి.. మనసులు సముద్రాలయ్యాయి.. వీరు తమ దేహాలతో కాదు, గుండెలతోనే వాళ్లను అలాయిబలాయి తీసుకున్నారు. వీరు వాళ్లలో ఒకరైనారు. వీరికి కష్టమొస్తే, నష్టమొస్తే వాళ్లు మంచి మాటల్తో వీరిని ఓదార్చే ఆదరించే ప్రవక్తలయ్యారు. వీరికి రోగమొస్తే, రొష్టాస్తే మందో మాకో ఇచ్చి అభయమిచ్చే దేవుళ్లయ్యారు. వీరందరూ ముసల్మానులయ్యారు. వీళ్ళు ఈ దేశ మూలవాసులు. ద్రావిడులు. మాదిగలు. మాలలు. ఆదివాసీలు, బీసీలు!

మాదిగ వాడలూ ముస్లిం గల్లీలూ
మురిక్వాల్వల్నీ ‘నీసు కంపు’ల్నీ
ఒక్కలాగే మోస్తుంటాయ్
వాని గుడిసెలో ఎండు తునకలై
మా సాయమాన్లో కవాబులై
దండేనికి వేలాడే ‘కౌసు వాసన’
మా బంధుత్వాన్ని చెబుతోంది

ముస్లింలు మతం మారినవాళ్లం కారు. వీరికి మతం లేకుండె. ఈ దేశంలో ఆదివాసీలకు, దళితులకు, బిసీ కులాలకు మతం లేదు. వీరికి ఇష్టమై ఇస్లాం స్వీకరించారు. వీరిలో కొందరు క్రైస్తవం స్వీకరించారు. ఇస్లాం, క్రైస్తవం స్వీకరించకుండా ఉండిపోయిన దళితుల్ని, ఆదివాసీల్ని, బిసీ కులాల్ని ఇవాళ బిజెపి, ఆరెస్సెస్ ‘హిందువు’లంటున్నాయి. మేం హిందువులం కామని బిసీల తరఫున ప్రొ.కంచ ఐలయ్య పుస్తకం రాశాడు. దళితుల తరఫున దళిత కవులు, మేధావులు అంటున్నారు. ఇంకా అంటారు. ఇన్నాళ్లు కప్పిపుచ్చిన నిజాల్ని, కుట్రపూరిత ఆరెస్సెస్ గోబెల్ ప్రచారాల్ని బద్దలు చేస్తారు. రేపటికి రాజ్యానికొస్తారు.

మొన్న దాస్యుణ్ణి నిన్న ఛండాలుడ్ని ఇవాళ నా సవాలక్ష గాయాల సాక్షిగా సాయిబుని

కేవలం 2 నుంచి 3 శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశ మూలవాసులే. ‘అంటబడనివ్వని’ కులాలనుంచీ, ‘వెనకబడేయబడ్డ’ కులాలనుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ విషయాన్ని తొక్కి పెట్టి మనువాదులు (‘హిందూత్వ’వాదులు) కుట్ర చేశారు. ముస్లింలను బైటి దేశస్తులుగా దుష్ప్రచారం చేశారు. దేశద్రోహులుగా, ఐఎస్ఐ ఏజెంట్లుగా ముద్రలు వెయ్యడానికి ప్రయత్నించారు. కానీ ముస్లింలు ఈ దేశ మూలవాసులు! ద్రావిడులు!

ఇరానియన్లను, ఈజిప్షియన్లను, ఆఫ్ఘనిస్తానీలను చూడగానే గుర్తుపట్టవచ్చు. నీగ్రోలను, తెల్లవాళ్లను గుర్తుపట్టవచ్చు. ఆఖరికి మన ఉపఖండంలోనే ఉన్న నేపాలీలను చూడగానే గుర్తుపట్టవచ్చు. వాళ్లు కూడా ఇక్కడి ముస్లింలను చూడగానే ఇండియన్లుగానే గుర్తుపడతారు! ఎందుకంటే ఆంత్రోపాలజీ ప్రకారం భౌగోళిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఈ భూగోళంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా, భిన్నమైన శరీర నిర్మాణాలతో మనుషులున్నారు. అట్లే ఇక్కడి వారంతా ఒక్కలాగే ఉన్నారు. అందుకే ఇక్కడ దళితులూ ముస్లింలు, బిసీలూ-ముస్లింలు, ఆదివాసీలూ-ముస్లింలు అన్నదమ్ముల్లాగే కనిపిస్తారు. వీళ్ళందరి ముఖ కవళికలూ, ముఖాలు (కాపాలాలు, ముక్కులు, వెన్నుపూసలు) ఒక్కతీరుగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్లే ముస్లింలైనారు కాబట్టి. అందుకే ముస్లింలు ఈ దేశ మూలవాసులు. ద్రావిడులు.

ఆనవాళ్లు, ఆధారాలు పరిశీలిద్దాం:

హైదరాబాదులో ధోబీలు (చాకలి), హజామ్ (మంగలి), ఖసాబ్ (కటిక), సునార్ (కంసాలి), బడయ్ (వడ్రంగి) తదితర వృత్తులు కొనసాగిస్తున్న ముస్లింలున్నారు. నల్గొండ టౌన్లో హైదరఖాన్ గుడ, మాన్యంచెల్క, జామ మసీదు, అక్కచెల్మ లాంటి ప్రాంతాల్లో సగంమంది మాల మాదిగలుంటే సగంమంది ముస్లింలున్నారు. ఇండ్లన్నీ కలిసిపోయి ఉంటాయి (దాన్నిబట్టి ఎవరు ముస్లింలుగా మారారో అర్థమవుతుంది). నల్గొండ జిల్లా కొప్పోల్ దగ్గర ఒక ‘గంట ఫకీరోల్ల గూడెం’ ఉంది. చీకటితోనే గంట కొడుతూ అడుక్కుంటానికి ఊర్లలోకి వచ్చేవాళ్లు వీళ్లు. బహుశా ‘యాచకుల’ నుంచి ఇస్లాం స్వీకరించినవారు. అన్ని జిల్లాల మారుమూలల్లో ఎలుగుబంటితో ఊర్లలోకి అడుక్కుంటానికి వచ్చే ముస్లింలున్నారు. ఊరూరు తిరుగుతూ కమ్మరి పని చేసేవారు (లోహార్), విగ్రహాలు పోతపోసే ముస్లింలున్నారు. ఖమ్మం పక్కన ‘జింకలోళ్లు’ ఉన్నారు. కడప జిల్లాలో గారడి వాళ్లున్నారు. పహిల్వాన్ (దొమ్మర ?) లున్నారు. వేంపల్లి లో ‘బోరేవాలే’ (ఈతచాపలు అల్లేవాళ్ళు) లవి 300 ఇండ్లు ఉన్నాయి. వీళ్లను బొంతలోల్లు అని మన తెలుగోల్లు పిలుస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్ చాపలు వచ్చేశాయి. కాబట్టి ఈతచాపలు ఎవరూ కొనడంలేదు. వాళ్లు కుట్టిన చాపలు వాళ్లలో ఎవరైనా చచ్చిపోతే చుట్టి బొంద పెట్టడానికి పనికివస్తున్నాయి. వాళ్లిప్పుడు దుర్భరమైన దారిద్ర్యంలో మగ్గుతున్నారు. జిల్లావ్యాప్తంగా వీళ్లున్నారు. వేంపల్లిలోనే ఘోడేవాలె (గుర్రాలోల్లు), లఖ్డే వాలె (అడవిలోకెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకొనేవాళ్లు) ఉన్నారు. నల్గొండలో ఊర్లకు ఊర్లు కాశోల్లు (ఫత్తర్ఫోడ్) ఉన్నారు. నల్గొండకు దగ్గర్లోనే కాశివారిగూడెం, కాసారం ఉన్నాయి. వీళ్లంతా రాళ్లు కొట్టే ముస్లింలు. రాళ్లు కొట్టడమే తమ పిల్లలకు విద్య, వేరే చదువులు చదివించలేకపోతున్నామంటున్నారు. మాలల నుంచి, పద్మశాలీల నుంచి ఇస్లాం స్వీకరించి రకరకాల పేర్లతో పిలువబడుతున్న దూదేకులవాళ్ల గురించి చాలావరకు అందరికీ తెలుసు. బీడీలు చుట్టే ఆడవాళ్లు, విస్తర్లు కుట్టే ఆడవాళ్లు, మిషిన్లు తొక్కే ఆడవాళ్లు, కూలినాలికిపోయే ఆడవాళ్లు ఎందరో..! 

ఇట్లా ఎన్నో ఉదాహరణలు..

రాజస్తాన్లో రోడ్లపై చెప్పులు కుట్టే ముస్లింలు కనబడతారు. బెంగాల్లో కూడా చెప్పులపని, తోలుపని చేస్తున్నారు. బనారస్ లాంటి చోట్ల బట్టలు నేసే ముస్లింలున్నారు. బీహార్లో పాములు ఆడించే ‘సఫేరా’లు ముస్లింలే. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో వివిధ వృత్తులు చేసే ముస్లింలు ఆనవాళ్లుగా కనిపిస్తారు. ఆదివాసీ-దళిత బహుజనుల 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఆయా కులాలవాళ్లే ముస్లింలుగా మారారని అర్థమవుతుంది!

న ఘర్కా న ఘాట్కా!
ఇస్లాం స్వీకరించకముందు ముస్లింలకు కులవృత్తులుండె. అక్కడా ఇక్కడా నవాబుల పాలన ఉన్న సమయంలో తమది ‘నవాబుల మతం’గా ఫీలయి కొంత, ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నవాళ్లను ఇతర బ్రాహ్మణ సమాజం ‘నీచం’గా చూస్తుండడంవల్ల మరింత ముస్లింలంతా వృత్తులు వదిలేసుకున్నారు. చిన్నాచితక ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కొంత భూముల్ని ‘పట్టా’ చేయించుకున్నారు. వ్యవసాయం చేయడానికి, చేయించుకోనికి వీళ్లేమీ బ్రాహ్మలు, రెడ్లు, కమ్మలూ, వెలమల్లాంటివాళ్లు కాకపోవడంతో తర్వాత్తర్వాత ఆ భూములు రెడ్లు, కమ్మలు, వెలమలే సొంతం చేసుకున్నారు. ఇటు వృత్తులు లేకుండాపోయాయి, అటు భూముల్లేకుండా పోయాయి. రెంట చెడ్డ రేవడి బతుకులయ్యాయి. అదనంగా రిజర్వేషన్లు లేకుండా చెయ్యడంతో మా బతుకులు అన్యాయమైపోయాయి.

రోడ్డున పడ్డాయి.
ఇవాళ రోడ్ల పక్కన పండ్ల బండ్లన్నీ ముస్లింలవే. రోడ్డు సైడు మెకానిక్ లు అందరూ ముస్లింలే. సైకిల్ గిల్లల పంక్చర్లు బాగుచేసేవాళ్లంతా ముస్లింలే. దర్జీలు, గడియారాలు బాగుచేసేవాళ్లు, హరేక్ మాల్ బండ్లవాళ్లు, గరంమిర్చి బండ్లు, చాయ్ హోటళ్లు, చిన్నచిన్న చెప్పుల షాపులు, టెంట్ హౌజ్ లు, ‘చిల్లర’ బేరగాళ్లంతా ముస్లింలే కావడం యాధృచ్ఛికమా? ఆటోవాలాలు, కారు జీపు-లారీ డ్రైవర్లంతా ముస్లింలే కావడం యాదృచ్ఛికమా? ఇటు చదువుకునే అవకాశాల్లేక, అటు ఉద్యోగాలు రాక ‘ధోబీ కా ఘదా న ఘర్కా న ఘాట్కా’ బతుకులైపోయాయ్.

ముస్లింలలో సాంఘికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఏర్పడ్డ ‘కులాలు’:
——–
1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
3. ధోబి ముస్లిం, ముస్లిం ధోబి, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురకల వన్నన్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు
4.ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి, గంటి ఫకీర్, గంటా ఫకీర్లు, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్
5. గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాముల వాళ్లు, కనికట్టు వాళ్లు, గారడోళ్లు, గారడిగ
6. గోసంగి ముస్లిమ్, పకీరు సాయిబులు
7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్రo వాళ్లు
8. హజామ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
9. లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ
10. పకీరియా, బోరెవాలే, డేరా ఫకీర్లు, బొంతల
11. ఖురేషి, కురేషి, ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
12. షైక్, షేక్
13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
14. తురక కాశ, కుక్కుకొట్టే జింక సాయిబులు, చక్కి టకానెవాలే, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు (ఫత్తర్ ఫోడ్), చక్కటకారే..
-పై కమ్యూనిటీల వాళ్ళు ప్రస్తుతం బీసీ ‘ఇ’ కింద ఉన్నారు.


1.సయ్యద్, 2.ముషేక్, 3.మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని, 6.అరబ్, 7.బొహరా, 8.షియా, 9.ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్, 12. జమాయత్, 13.నవాయత్లు      -ఈ కమ్యూనిటీల వాళ్ళు బీసీ బీ, బీసీ ఇ రిజర్వేషన్ల కిందికి రారు.


ఇలా ముస్లింలలో అనేక దొంతరలు కనిపిస్తున్న నేపథ్యంలో వారికి శాశ్వత ప్రాతిపదికన మేలు జరగాలంటే మరో కోణంలో కూడా దీర్ఘకాలిక అధ్యయనం జరగాల్సి ఉంది. ముస్లిం మూలాలలోకి వెళ్లి లోతైన అధ్యయనం జరిగితేనే వారికి హేతుబద్దమైన న్యాయం జరుగుతుంది. అందుకు ఏయే కులాల నుంచి ఇస్లాం స్వీకరించిన ముస్లింలు ఎవరెవరో పరిశోధించాల్సి ఉంది. గుర్తించాల్సి ఉంది.

ప్రస్తుతం ముస్లింలలో కొన్ని ఉపసమూహాలైన దూదేకుల, లద్దాఫ్‌, పింజారి లకు బి.సి. ‘బి’ గ్రూప్‌ రిజర్వేషన్‌ ముందు నుంచి ఉంది. కాని ఆ గ్రూప్‌లోని ఇతర బీ.సీ. కులాలతో ముస్లింలు పోటీపడలేకపోతున్నారు. దాంతో ఆ గ్రూప్‌ రిజర్వేషన్‌ వల్ల ఆ ముస్లింలకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన సమయంలో పఠాన్‌, సయ్యద్‌ తదితర కొన్ని సమూహాలను పక్కన పెట్టి మిగతా ఉప సమూహాలకు బీసీ ‘ఇ’ రిజర్వేషన్‌ కల్పించారు. దాంతో తమ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదని సయ్యద్‌, పఠాన్‌ తదితర సమూహాలు గోసపడుతున్నాయి. నిజానికి ఈ ఇంటిపేర్లు ఎవరి ఇష్టానుసారంగా వారు పెట్టుకున్నవే తప్ప అవి ఏ మాత్రం వారి సామాజిక, ఆర్థిక పరిస్థితిని పట్టిచ్చేవి కావు.

ఆంధ్రా ప్రాంతంలో దళితుల నుంచి క్రైస్తవం స్వీకరించిన వారిని దళిత క్రైస్తవులుగా మనం గుర్తించ గలుగుతున్నాం. కారణం, వారి పేర్లలో, ఆచార వ్యవహారాల్లో ఆనవాళ్లు మిగిలి ఉండడం. వాడల్లోనూ, ఊర్లలోనూ వారి ఇండ్లు ఒక్కచోటనే ఉండడం వల్లనూ వారిని గుర్తించడం సులువుగా ఉంది. ముస్లింల విషయం అలా కాదు. ఏ కులం నుంచైనా ఇస్లాం స్వీకరించగానే వారి పూర్తి పేర్లతో సహా, ఆచార వ్యవహారాలు, వేష భాషలు అన్నీ మారిపోతాయి. ఒక్క తరంలోనే వారు ఏ కులం నుంచి ముస్లింలయ్యారో ఆనవాళ్లు దొరకని పరిస్థితి. దాంతో వారి ఆర్థిక పరిస్థితి మారదు సరికదా వారు ఓ.సీ. గ్రూపులో జమ అయిపోతూ వచ్చారు. ఎస్‌.సి. రిజర్వేషన్‌ ఉండే దళితులు క్రైస్తవం స్వీకరిస్తే బి.సి ‘సి’ అవుతున్నారు. (నిజానికి రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో మతస్వాతంత్య్రపు హక్కు ఉన్నప్పుడు ఇలా ‘హిందూ’ మతంలోని దళితులకు ఒక రిజర్వేషన్‌, క్రైస్తవ మతంలోని దళితులకు ఒక రిజర్వేషన్‌ కేటాయించడం అన్యాయం). కాని అదే దళితులు ఇస్లాం స్వీకరిస్తే? అందుకు ప్రత్యేకంగా ఏ రిజర్వేషన్‌ లేకపోవడం, తద్వారా వారంతా ఓ.సీ.లైపోవడం జరుగుతూ వచ్చింది. దళితుల నుంచి ముస్లింలుగా మారిన వారిని గుర్తించడానికి వారి నివాస ప్రాంతాలు, ఒకానొకచో మిగిలిన వృత్తి, కొన్ని ఆచార వ్యవహారాలు లెక్కలోకి తీసుకోవచ్చు. బి.సి. ‘బి’ లో ఉన్న దూదేకులు, లద్దాఫ్‌, పింజారీలు దూదిఏకే కులం వారుగా గుర్తించబడుతున్నారు. బహుశా వారు మాల, పద్మశాలి (?) కులాల నుంచి ముస్లింలయి ఉంటారు. బి.సి. ‘బి’లో ఉన్న ముస్లింలు కాకుండా మిగతా ముస్లింలంతా దాదాపుగా మిగతా అట్టడుగు కులాలు, తెగల నుంచి ముస్లింలుగా మారినవాళ్లే. ఉదాహరణకు బోరేవాలాలు – అంటే ఈతచాపలు కుట్టేవారు. అంటే ఆ వృత్తి ఎరుకల కులంలో ఉంది. ఎరుకలవారు ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు. మరి వారికి ఎస్‌.టి. రిజర్వేషన్‌ కొనసాగాలి కదా! ఈ తరహా అధ్యయనం జరగాల్సిన అవసరముంది. అలాంటి వారిని ముస్లిం రిజర్వేషన్‌లో ‘ఎ’ కేటగిరి కింద చేర్చడం, ఎస్‌.సి. నుంచి ఇస్లాం స్వీకరించినవారిని ‘బి’ కేటగిరి కింద, దూదేకుల తదితరులను ‘సి’ కింద చేర్చడం – ఇలాంటి వర్గీకరణ కొంతవరకు ముస్లింలలోని ఉపసమూహాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇలాంటి ప్రక్రియ ఏదో ఒకచోట నుంచి మొదలవాల్సిన అవసరముంది. లేదంటే ముస్లింలలోని వివిధ ఉప సమూహాలలో అసంతృప్తి పెరుగుతూపోవడం ఖాయం.